జాబిల్లి వైపు నేడే పయనం

జాబిల్లి వైపు నేడే పయనం
మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2
పూర్తయిన ఏర్పాట్లు
కౌంట్‌డౌన్‌ ప్రారంభం
రాకెట్‌లో లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు
జాబిల్లి వైపు నేడే పయనం
శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లనుంది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-2 ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్‌ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 20 గంటల పాటు కొనసాగి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 నింగిలోకి వెళ్లనుంది. వాహకనౌక 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ బయలుదేరిన తరువాత 16.13 నిమిషాలపాటు ప్రయాణించి, నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన పిదప చంద్రయాన్‌-2 రాకెట్‌ నుంచి విడిపోతుంది.  ఈ ప్రయోగాన్ని ఈ నెల 15వ తేదీ వేకువజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్‌ ట్యాంకర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాయిదా వేశారు. శాస్త్రవేత్తలు దీన్ని సరిచేసి, సోమవారం ప్రయోగానికి సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇస్రోలోని అన్ని విభాగాల సంచాలకులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు, విశ్రాంత శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు షార్‌కు చేరుకున్నారు.
సవాళ్లతో కూడిన ప్రయోగం
చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత సవాల్‌తో కూడిన పని. ఇస్రో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. ఇస్రో చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం చేస్తున్న మొదటి ప్రయత్నమూ ఇది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ విడిపోయిన తరువాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.

Popular Posts